Thursday, 19 June 2014

                దైవసాక్షిగా బాబు, వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం
నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ కొలువు తీరింది.  అసెంబ్లీ మొదటి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని అనుసరించి ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసన సభా భవన మందిరంలో సభ సమావేశం అయ్యింది. సభ ప్రారంభం కాగానే  ప్రొటెం స్పీకర్‌ పతివాడ నారాయణస్వామి నాయుడు సభా మర్యాదలు సభ్యులకు తెలిపారు.




అనంతరం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి

Sunday, 8 June 2014

మూడో సారి...



మూడో సారి...
seema andra
ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తొలి ముఖ్యమంత్రిగా జిల్లావాసి ఎన్.చంద్రబాబునాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా బా ధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. అంతా ఊహించిన విధంగానే ఈ దఫా ఆయన కేబినెట్‌లో జిల్లా నుంచి సీనియర్ శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఒక్కరికే అవకాశం దక్కింది. బొజ్జల కూడా మూడోసారి మంత్రి పదవి పొందడం గమనార్హం.

ముఖ్యమంత్రిగా తాను జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అన్ని సమీకరణల తరువాత ప్రస్తుతానికి బొజ్జలకు మాత్రమే బాబు కేబినెట్‌లో చోటు కల్పించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ పదవిని బలిజ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చదల వాడ కృష్ణమూర్తికి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో బాబు ప్రకటించారు. దీంతో జిల్లాలో బలిజ సామాజికవర్గం నుంచి ఇద్దరు శాసనసభ్యులు ఎన్నికైనప్పటికీ వారికి కేబినెట్‌లో అవకాశం కల్పించే పరిస్థితి లేకపోయిందని భావిస్తున్నారు.

అదేవిధంగా వెనుకబడిన వర్గాల నుంచి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా జి.శంకర్‌యాదవ్ ఎన్నికయ్యారు. ఇతర జిల్లాల నుంచి బీసీలకు అవకాశం ఇవ్వడం, శంకర్ తొలిసారిగా శాసనసభకు ఎన్నికైనందున ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్యవేడు నుంచి యువకుడైన తలారి ఆదిత్య తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్నారు. దీంతో ఆయనకు కూడా అవకాశం లేకుండా పోయింది.

బాబు సామాజికవర్గానికి చెందిన సీనియర్లు ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి ఓటమిపాలైన విషయం తెలిసిం దే. అయితే ముద్దుకృష్ణమనాయుడుకు మంత్రి పదవి ఇచ్చి శాసనమండలికి పంపుతారనే ప్రచారం జరిగింది. పార్టీలో అసంతృప్తులు వచ్చే ప్రమాదం ఉండటంతో ఈ ప్రయోగానికి చంద్రబాబు మొగ్గుచూపలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

చంద్రబాబు ప్రస్థానం..

విద్యార్థి దశ నుంచీ రాజకీయాల పట్ల మొగ్గు చూపిన నారా చంద్రబాబునాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి రాజకీయ దిగ్గజం పాటూరు రాజగోపాల్‌నాయుడు ప్రోత్సాహంతో కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా పదవీకాలం చివరిలో సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ ఆయనను వరించింది. ఆ తరువాత 1983లో మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు.

ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేసి టీడీపీ చేతిలో పరాజయం పాలయ్యారు. కొద్దిరోజుల తరువాత చంద్రబాబు టీడీపీలో చేరి కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. 1989లో కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తూనే ఉన్నారు. 1995 సెప్టెంబర్‌లో మామ ఎన్టీఆర్‌ను గద్దెదించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లోనూ వాజ్‌పేయి హవాతో రాష్ట్రంలో టీటీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు రావడం, వాటిని ఎదుర్కోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అన్ని వర్గాల ప్రజల్లో నూ వ్యతిరేకత వ్యక్తమయింది. 2004లో జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. 2009లోనూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హవాతో తెలుగుదేశం అధికారంలోకి రాలేకపోయింది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మూడోసారి ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.

బొజ్జలను మూడోసారి వరించిన మంత్రిపదవి

శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆరు దఫాలు పోటీ చేసి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన సీనియర్ సభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మరోసారి మంత్రి పదవి వరించింది. 1996, 2001 సంవత్సరాల్లో ఆయన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవులు అలంకరించారు. తొలుత చిన్ననీటిపారుదల, ఆర్ అండ్ బి శాఖల మంత్రిగాను రెండోసారి ఐటీ, డ్వాక్రా, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు

Thursday, 5 June 2014


                 రోడ్డుపై డబ్బులు విసిరేసి.. హల్‌చల్!



 *ఫోర్జరీ సంతకంతో డబ్బు డ్రా చేసిన కొడుకు
 *సీసీ కెమెరాతో కనిపెట్టిన యజమాని
 *పోలీసులకు చిక్కకూడదని రోడ్డుపై డబ్బు పడేసిన నిందితుని తండ్రి

చిత్తూరు జిల్లా పలమనేరులో  ఓ వ్యక్తి రోడ్డుపై డబ్బులు విసిరేసి హల్‌చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే. తిరుపతికి చెందిన శ్రీధర్ బెంగళూరులోని మారుత్‌హళ్లి అయ్యప్ప లేఔట్‌లో రియల్టర్‌గా ఉన్నాడు. ఇతని వద్ద తిరుపతికే చెందిన డాల్ రెడ్డి(29) నమ్మకస్తునిగా ఉండేవాడు. డాల్‌రెడ్డి యజమాని చెక్కులను ఫోర్జరీ చేసి అక్కడి బ్యాంకులో బుధవారం ఉదయం రూ.1.49 లక్షలు డ్రా చేసుకున్నాడు. దీంతో శ్రీధర్ సెల్‌కు మెసేజ్ వెళ్లింది. వెంటనే అతను బ్యాంకు కు వెళ్లి విచారించగా అక్కడి సీసీ కెమెరాల ద్వారా విషయం బయటపడింది.

అతను డాల్‌రెడ్డిని నిలదీశాడు. ఆ డబ్బును తన తండ్రి వద్ద ఇచ్చి తిరుపతికి బస్సులో పంపేశానని డాల్‌రెడ్డి చెప్పాడు. వెంటనే బస్సు నుంచి దిగేయాలంటూ డాల్‌రెడ్డి ద్వారా అతని తండ్రికి ఫోన్ చేయించారు. దీంతో డాల్‌రెడ్డి తండ్రి పలమనేరు మార్కెట్ కమిటీ వద్ద మెయిన్‌రోడ్‌పై బస్సు దిగాడు. తన వద్ద ఉన్న లక్షకు పైగా డబ్బును రోడ్డుపై విసిరేశాడు. ఆ డబ్బు తనది కాదని చెప్పడం మొదలు పెట్టాడు. స్థానికులు ఈ వ్యవహారంతో ఆశ్చర్యపోయారు.

ఇంతలో అక్కడకు శ్రీధర్ మరికొందరితో కలసి కారులో చేరుకున్నాడు. రోడ్డుపై ఉన్న డబ్బును తీసుకుని, డబ్బు విసిరేసిన వ్యక్తిని కారులో కూర్చొబెట్టుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుడు శ్రీధర్ స్థానిక సీఐ బాలయ్యకు విషయం వివరించాడు. బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు. దీంతో వారందరినీ సీఐ బెంగళూరుకు పంపేశారు. ఈ వ్యవహారం పలమనేరులో నిన్న హాట్‌టాపిక్‌గా మారింది